ఈటల బాధేంటి…? కేసీఆర్ ఏం చేయబోతున్నారు..?
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి కీలక భూమిక పోషించారు ఈటల రాజేందర్. కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడు కూడా. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నాటి సీఎం వై.ఎస్.ను సమర్థంగా ఎదుర్కొన్న నేత ఈటల రాజేందర్. ఆయన సత్తా తెలిసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే మంత్రిపదవి అప్పగించారు. ఆర్థిక శాఖ లాంటి కీలక బాధ్యతలను ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కానీ రెవిన్యూ, ఆర్థికం లాంటివి కాకుండా వైద్యారోగ్య శాఖ దక్కింది. టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు తర్వాత వినిపించే పేరు ఈటల రాజేందరే. కానీ ఏమైందో.. ఏమో కేసీఆర్ కు, ఈటలకు గ్యాప్ పెరిగిపోయింది.
ఈ మధ్యకాలంలో ఈటల రాజేందర్ కు అటు పార్టీలోకానీ, ఇటు ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఈటల. కరోనా రాకముందు ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం సాగింది. ఇంతలో కరోనా రావడంతో వైద్యారోగ్య శాఖ కీలకంగా మారింది. ఈటల కూడా ఈ క్రైసిస్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని పనిచేశారు. కష్టకాలంలోనూ వైద్యసిబ్బందిగి అండగా నిలిచి మంచిపేరు తెచ్చుకున్నారు. కోరనాను కట్టడి చేయడంలో ఈటల బాగా పనిచేశారంటూ సీఎం కేసీఆర్ కూడా మెచ్చుకున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో పార్టీతో బాగా గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మరో బీసీ నేత గంగుల కమలాకర్ కు కేబినెట్ లో స్థానం దక్కడంతో పాటు కేసీఆర్ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమైంది. ఈటలకు చెక్ పెట్టేందుకే గంగుల కమలాకర్ ను తెరపైకి తెచ్చారని ఈటల అనుచరులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగానే అడుగులు వేయడంతో ఈటలతో పాటు ఆయన అనుచరగణం తెరమరుగైపోవడం ప్రారంభమైంది. త్వరలోనే మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు.
తనను తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో ఈటల చేసిన కామెంట్స్ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమేనంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈటల వ్యాఖ్యలతో పార్టీలోని అసంతృప్త నేతలందరూ మళ్లీ యాక్టివ్ అయ్యారనే చెప్పొచ్చు. ఉద్యమకాలంలో కేసీఆర్ వెన్నంటి ఉండి.. తర్వాత తెరమరుగైపోయిన నేతలందరికీ ఈటల రూపంలో కాస్త ధైర్యం దొరికినట్లయింది. తాజాగా.. ఈటల మరోసారి అలాంటి కామెంట్సే చేశారు. పార్టీలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. మనిషిని మాత్రమే గుర్తు పెట్టుకోవాలని అనుచరులకు సూచించారు. తాను ఇబ్బంది పడుతూ ఉండొచ్చుగాక.. కానీ మిమ్మల్ని ఎప్పుడు మరిచిపోలేదన్నారు. వేదాంత ధోరణలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రగతి భవన్ లో జరిగే సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం, తాజా మండలి ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించకపోవడం.. లాంటి అనేక అంశాలు ఈటలలో అసంతృప్తి జ్వాలలను రగిలిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తనలోని ఆవేదనను వేదాంత ధోరణలో వ్యక్తపరిచారని భావిస్తున్నారు. పార్టీని ఉద్దేశించే ఆయన పరోక్షంగా కామెంట్ చేశారనే ఊహాగానాలు వినిపించాయి. దీంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. అసెంబ్లీ ముగిసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్వయంగా ఈటలను ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. లోపల ఏం జరిగిందో తెలీదు. కేసీఆర్ బుజ్జగించారా.. లేకుంటే ఈటల తన ఆవేదనను కేసీఆర్ కు చెప్పారా.. అనే అంశాలు తెలియాల్సి ఉంది.













