ఆ పార్టీ వల్లే దేశం నాశనం అవుతోంది : మంత్రి ఎర్రబెల్లి
బీజేపీతోనే దేశం నాశనం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ.3 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, ఆపార్టీ నాయకులు దుర్మార్గులు, దొంగలని మండి పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎస్కటి తుపాకి వెంకట్రామడి మాటల్లా ఉన్నాయని ఎద్దేవ చేశారు. కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా తేలేదని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ వాళ్లు మాత్రం దేశాన్ని నాశనం పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.













