స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు మరో ముందడుగు.. రూ.200 కోట్లు కేటాయించిన మేఘా

తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడిరది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి కంపెనీ తమ సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.