మేడారం మహాజాతరలో కీలక ఘట్టం
తెలంగాణలోని మేడారంలో జరుగుతున్న మహాజాతరలో కీలక ఘటం ఆవిష్కృతమైంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. చిలకలగుట్ట మీద నుంచి కుంకమ భరిణె రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం, భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. సమ్మక్క ఆగమన ఘట్టం మొత్తం కొనసాగింది. తెల్లవారుజామున మేడారానికి సమీపంలోని పడిగాపూర్ సమీపంలోని అడివికి వెళ్లిన పూజారులు వెదురువనాన్ని ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూజారులు సిద్ధబోయిన మునీందర్, మహేశ్, లక్ష్మయ్య, జగ్గారావు, వడ్డె కొక్కెర కృష్ణయ్య తదితరులు చిలకలగుట్టపైకి వెళ్లి రహస్య పూజలు నిర్వహించారు.













