మేడారం మహాజాతర తొలి ఘట్టం.. అత్యంత వైభవంగా ప్రారంభం
మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. పూజారులు కుటుంబ సమేతంగా డోలి వాయిద్యాలతో వెళ్లి గుడుల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి ధూప, దీప, ఇష్ట నైవేద్యాలు సమర్పించారు. కోటిన్నర మంది భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించే శక్తిసామర్థ్యాలను అందించాలని వేడుకొన్నారు. అమ్మవార్లను తీసుకొచ్చే కొక్కెర కృష్ణయ్య, కాక సారయ్య, ఇతర ప్రధాన పూజారులు ఉపవాస దీక్ష చేపట్టారు. తెగ పెద్దలను పూజా కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. ఈ వేడుకను పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.













