మెదక్ జడ్పీ అధ్యక్షురాలికి అరుదైన గౌరవం
తండ్రి పదవీ విరమణ కార్యక్రమానికి కుమార్తె ముఖ్య అతిథిగా హాజరైన అరుదైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటు చేసుకుంది. మెదక్ జడ్పీ అధ్యక్షురాలు హేమలత గౌడ్ తండ్రి ఆంజనేయులు గౌడ్ తూప్రాన్‌లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. బుధవారం ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తూప్రాన్‌లో ఆ శాఖ ఉద్యోగులు ఆయన సన్మానానికి ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన కుమార్తె, జడ్పీ అధ్యక్షురాలు హేమలత గౌడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా పెంచిన తండ్రి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జీవితంలో మరచిపోలేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే ఇలాంటి అరుదైన గౌరవం దక్కిందన్నారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలితో పాటు అధికారులు, బంధువులు ఆంజనేయులు, లక్షి దంపతులను సన్మానించారు.













