ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ వాసి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం తల్లి ఉషారాణి షాద్‌నగర్ వచ్చింది. సోమవారం అరవింద్ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. అతడి భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అరవింద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఆ శవం అరవింద్‌దేనని ధ్రువీకరించారు. అతడిది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.