అక్కడ గెలిస్తే ఏం చేస్తారో… వారిద్దరూ చెప్పలేదు
బీజేపీ, టీఆర్ఎస్ బహిరంగ సభలు రెండూ రాజకీయాలు చుట్టే తిరిగాయని, సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌తో మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారని కేసీఆర్, అమిత్ షా చెప్పలేదని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనేందుకు పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీల అమలు ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు. టీఆర్ఎస్ ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే బీజేపీ, టీఆర్ఎస్ పరస్సరం తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పడం కొత్తేమి కాదని అన్నారు.













