100 దేశాల్లో టీఆర్ ఎస్ శాఖలు : కవిత
వచ్చే నెల 27న నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లోపు వందదేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవహారాల బాధ్యురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత..టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలకు సూచించారు. హైదరాబాద్‌లో ఎంపీ కవితను ఆయన కలిసి ఎన్నారైల శాఖల ఏర్పాటు, పనితీరు, కార్యకలాపాలపై చర్చించారు. ఇటీవల కెనడాశాఖను ఏర్పాటుచేశామని, మొత్తం నలభై దేశాల్లో టీఆర్ఎస్ శాఖలు పనిచేస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, పార్టీని విదేశాల్లోనే బలపడేలా చూడటం మన బాధ్యత అని ఎంపీ కవిత చెప్పారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల బాధ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా టీఆర్ఎస్ మిషన్‌లో భాగస్వామ్యులై పార్టీని మళ్లీ అధికారంలో తేవడంలో కృషి చేశారంటూ అభినందించారు.













