భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ‘మహాబతుకమ్మ’
ఉయ్యాలో.. లేచెనే గౌరమ్మ ఉయ్యాలో..చన్నీటి జలకాలు ఉయ్యాలో..ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో..ముత్యమంత పసుపు ఉయ్యాలో..ముఖమంతా పూసి ఉయ్యాలో..చింతాకు పట్టుచీర ఉయ్యాలో..చింగులు మెరవంగ ఉయ్యాలో.. రంగురంగుల బతుకమ్మలు.. తీరొక్క పూల గుబాళింపు.. వినసొంపైన జానపదాలు.. కోలాటాలు.. వేలాది మంది ఆడపడుచుల ఆటపాటలు.. మంగళవా రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ముద్దబంతై మురి సింది! తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో సుమారు 36 వేలమంది మహిళలతో నిర్వహించిన ‘మహాబతుకమ్మ’ అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా, ప్రశాంతంగా జరిగింది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం, పర్యాటక, జిహెచ్ఎంసి, విద్యుత్ ఇతరత్రా శాఖలు విస్త్రృత ఏర్పాట్లు చేశాయి. గత సంవత్సరం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇదే స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధించగా, ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో రికార్డు స్థాయిలో మహిళలు హాజరు కావటంతో స్టేడియం మొత్తం పూలవనాన్ని తలపించింది. అత్యధిక సంఖ్యలో మహిళలు హాజరై మరోసారి బతుకమ్మకున్న విశిష్టత, ప్రత్యేకతను చాటుకున్నారని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడటం సాధారణ విషయం కాదని తెరాస ఎంపీ కవిత అన్నారు. కాగా ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోగల ఎల్బీస్టేడియంలో నిర్వహించిన మహాబతుకమ్మ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కవిత హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మకు ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.













