అకాల వర్షం… రైతు స్థైర్యాన్ని దెబ్బతీసింది
ఈసారీ అకాల వర్షం దెబ్బేసింది. తెలంగాణ రైతాంగానికి భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అకాల వర్షం పడింది. పగలు మొత్తం ఎండగా ఉండి, సాయంత్రానికి ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. రోడ్లపై, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముదైంది. పలు గ్రామాల పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో ఆ బస్తాలు కూడా తడిసిపోయాయి. జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కొనుగోలును అధికారులు వేగిరం చేయకపోవడంతో వర్షానికి ధాన్యం దెబ్బతింటోంది.
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, ధర్యాపూర, నవీపేట, కేశ్పూర్ మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇక కామారెడ్డి జిల్లాని బాన్సువాడ, బీర్కూర్, జుక్కల్, పిట్లం, నిజాం సాగర్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. రైతులు పండిన పంటను ప్రధాన రహదారులపై ఆరబోసుకోవడంతో పూర్తిగా తడిసిపోయింది. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోనూ ఇదే పరిస్థితి. సాయంత్రం నుంచి రాత్రి వరకూ విపరీతంగా వాన కురిసింది. గాలి దుమారంతో పలు చోట్ల వక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మణుగూరు, పాల్వంచ, అశ్వాపురం, కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో గాలి దుమారం లేచింది. దీంతో మామిడి తోటల్లోని మామిడి కాయలు నేలరాలాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులు పర్యటనలు ప్రారంభించారు. తడిసిన ధాన్యాన్ని, నష్టపోయిన పంట విలువను అంచనా వేస్తున్నారు. నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి, ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు తెలిపారు.













