తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూ పై… క్లారిటీ ఇచ్చిన మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. అయినా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కేసులు పెరుగుతున్నా ఎక్కువ మందిలో లక్షణాలు లేవన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే ఉందన్నారు. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందని, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్ ఇస్తున్నట్టు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్ సులభమవుతోందన్నారు. టెస్టులను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగుతోందన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లూ అందుబాటులో ఉన్నాయన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని విధిగా మానిటర్ చేస్తున్నట్లు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.













