25 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని లేఖ రాశాం : ఈటల
రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరత ఉన్నమాట వాస్తవమేనని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఒప్పుకున్నారు. అయితే వీటి కొరత రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ శుక్రవారం హుజురాబాద్‌లో పర్యటించారు. వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ కూడా రాశామని వెల్లడించారు. 25 ఏళ్లు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందివ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. అయితే మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే ఆస్కారం లేదని, అయితే అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని ఆయన అభ్యర్థించారు. రెమిడేసివిర్ ఇంజెక్షన్‌ను ఎవరూ బ్లాక్‌లో కొనవద్దని, ఎమర్జెన్సీ అయితేనే వాడాలని ఈటల రాజేందర్ సూచించారు.













