తెలంగాణ ఉత్పత్తులకు జీఐ బ్రాండింగ్ : కేటీఆర్
వివిధ వస్తువుల పుట్టుపుర్వోత్తరాలను తెలియజేయడంలో భౌగోళిక సూచన (జియోలాజికల్ ఇండెక్స్ -జీఐ) గుర్తులు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ జీఐ పై రూపొందించిన ఈ బుక్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం 15 వస్తువులకు మాత్రమే జీఐ కింద నమోదయ్యాయని, తెలంగాణలో మరిన్ని ఉత్పత్తులు జీఐ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కనీసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి జీఐ నమోదు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా విడుదలైన ఈ బుక్ ద్వారా రాష్ట్రంలో వివిధ ఉత్పత్తులు, ప్రదేశాలు, తయారీదారులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా ఉత్పత్తుల తయారీలో ఏళ్ల తరబడి సాధించిన నైపుణ్యం, చరిత్ర, సంస్కృతి వెలుగులోకి వస్తుందని, జీఐ టూరిజంను ప్రోత్సహించడంలో ఈ బుక్ తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా మొదట రాష్ట్రంలోని ఉత్పత్తులకు బ్రాండ్ సాధించే పేరు గడించాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.













