కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత పేరు దాదాపు ఖరారైంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేత కేసీఆర్ ఈ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కంటోన్మెంట్ టికెట్ విషయంపై చర్చించారు. ఏడాదిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందితలను కోల్పోవడం దురదృష్టకరమని, ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయన్న రెండో కుమార్తె, లాస్య నందిత సోదరి నివేదితను ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించనున్నట్టు పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉగాది సందర్భంగా మంగళవారం నివేదిక అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.