ఇక సెలవు.. ముగిసిన ప్రీతి అంత్యక్రియలు
హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని స్వగ్రామం గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇంటి వద్ద ప్రీతి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మధ్యాహ్నం మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. అంతకుముందు ప్రీతి పాడెను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మోశారు. అంత్యక్రియలకు వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. బీజేపీ చెందిన మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు, జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.













