అంగరంగ వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజారోహణ మహోత్సవాన్ని అర్చకులు, యాజ్ఞికులు, పారాయణందారులు వైభవంగా నిర్వహించారు. మొదట ప్రత్యేక పూజలతో యజ్ఞశాలలో హోమం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం జరిపారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణ మహోత్సవాన్ని గంటన్నర పాటు కనుల పండువగా జరిపించారు. ధ్వజారోహణంలో భాగంగా గరుత్మంతుడి ప్రతిమను తెల్లని వస్త్రంపై చిత్రించి, ధ్వజస్తంభానికి అలంకరించి.. నారసింహుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. సుమారు గంటన్నర పాటు కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈఓ గీత, ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహచార్యులు, మోహనాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.













