చేప మందు పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. బత్తిని హరినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం మృగశిర కార్తె సందర్భంగా చేప మందును పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన పలువురు అస్తమా రోగులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. చేప మందు పంపిణీకి లక్షా 60 వేల చేప పిల్లలను సిద్ధం చేశారు. కాగా మొత్తం 36 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చేప మందు కోసం వచ్చే వారికి ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అంతేగాక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొత్తం 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.













