తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశముందని, దాదాపు 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని తెలిపారు. తన సర్వే ఫలితాలను డిసెంబర్ 7న వెల్లడిస్తానని తెలిపారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి (బీఎల్ఎఫ్) గెలుస్తారని, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో అనిల్ జాద్ (కాంగ్రెస్ రెబల్) గెలుస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రలోభాలకు తలొగ్గడం లేదు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబెల్స్‌కు పట్టం కట్టడం సంతోషకరం అని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కానని పునరుద్ఘాటించారు.













