పార్టీ మార్పుపై స్పందించి, సస్పెన్స్ పాటించిన ఎల్. రమణ

కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపిన మాట మాత్రం వాస్తవమేనని వెల్లడించారు. అయితే ఏ విధమైన ప్రతిపాదనలు మాత్రం వారు తన ముందు పెట్టలేదని కుండబద్దలు కొట్టారు. ఈ రెండు పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందినా, తాను మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తానే పదవుల కోసం పాకులాడుతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని, పదవుల కోసం పరిగెత్తే వ్యక్తిని ఎంత మాత్రమూ కాదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటానని, ఈ పనిచేసే క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఏ పనిని అప్పజెప్పినా, సక్రమంగా నిర్వహించడానికే ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు మాత్రం వస్తున్నాయని, ఈ మార్పులను గమనిస్తూ, ఆయా పార్టీలు స్పందిస్తున్నాయని అన్నారు. బడుగుల కోసం టీడీపీ ఎంతో చేస్తోందని, ఎన్టీఆర్, చంద్రబాబు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, ఎంపీగానూ అవకాశం కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే ప్రజా జీవితంలో ఎలా ముందుకెళ్లాలి, ఈ రెండు పార్టీల ఆహ్వానం విషయంపై కార్యకర్తలు, సన్నిహితులతో కలిసి చర్చిస్తానని, ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని ఎల్. రమణ పేర్కొన్నారు.
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ మారనున్నారని కొన్ని రోజులగా వార్తలొస్తున్నాయి. టీడీపీని వీడి, అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోనున్నారని కూడా వార్తలొచ్చాయి. టీఆర్‌ఎస్‌లో చేరడానికి మంత్రి ఎర్రబెల్లి రాయబారం నడిపారని, పార్టీలో చేర్చుకోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుముఖంగానే ఉన్నారని వార్తలొచ్చాయి. ఎల్. రమణ కూడా పార్టీ మార్పుకు ఓకే అన్నట్లుగానూ వార్తలొచ్చాయి. ఎల్. రమణను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొని, ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్. రమణ స్పందించారు.