వరంగల్ లో మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ
మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ వరంగల్‌లో అడుగుపెట్టనున్నది. ఎల్అండ్టీ అనుబంధ మైండ్‌ట్రీ ఐటీ కంపెనీ వరంగల్‌లో తన సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మెట్రో ప్రారంభంతో పాటు మరో సంతోషకరమైన విషయం అంటూ ట్వీట్ చేశారు. ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ఇప్పటికే రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థను స్థాపించాయి.
తాజాగా మైండ్‌ట్రీ కూడా ఇదే బాటాలో నడిచేందుకు సిద్ధమైంది. మైండ్‌ట్రీ రెండో కారిడార్ ప్రారంభోత్సవంలో భాగంగా ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎన్ సుబ్రమణ్యన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సలహాతో వరంగల్‌లో మైండ్‌ట్రీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. మైండ్‌ట్రీ సంస్థ.. గ్లోబల్ టెక్నాజీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నది. ఈ సంస్థ వరంగల్‌కు రావడం ద్వారా మరిన్ని కంపెనీలు ఇక్కడకు తరలి వచ్చే అవకాశాున్నాయి. వరంగల్ నగరానికి ఐటీ రంగంలో మంచి భవిష్యత్ ఉండనున్నది.













