కూచిపూడి మహారాణి పద్మశ్రీ డాక్టర్ కట్టా శోభా నాయుడు ఇక లేరు!
న్యూరోలజి సమస్య తో స్టార్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ రాత్రి 1.44 నిముషాలకు కనుమూశారు! ఒక అద్భుతమైన నాట్య రారాణిని కూచిపూడి నాట్య రంగం కోల్పోయింది! దేశ విదేశాల్లో రెండు వేల మంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చి దిద్దిన ఘనత శోభా నాయుడుదే ! 100 కు పైగా సోలో కొరియోగ్రఫీల సృష్టికర్త! పాతిక కూచిపూడి నృత్య రూపకాల సృజనశీలి ! పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం, నృత్య చూడామణి, ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ పురస్కారం తో పాటు వందలాది పురస్కారాలు ఆమెను వరించాయి! ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చే ప్రత్యేకత, వేదిక పై దునుమాడే శక్తి వున్న ఏకైక శాస్త్రీయ సాంప్రదాయ నర్తకీమణి శోభానాయుడు ! హైదరాబాద్ దోమలగూడా లో ఎన్నో ఏళ్లుగా కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్థాపించి సేవలు అందిస్తున్న మహనీయురాలు శోభానాయుడు ను కరోనా బలి తీసుకోవడం విచారకరం దురదృష్టకరం! ఆమె భర్త శ్రీ అర్జునరావు రిటైర్డ్ IAS. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో చీఫ్ సెక్రటరీ గా పని చేశారు! కూచిపూడి మహా దిగ్గజం దివంగత వెంపటి చిన సత్యం ప్రియ శిష్యురాలు శోభానాయుడు ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నాట్యానికి ఔనత్యాన్ని తెచ్చారు! కూచిపూడి నాట్యం కోసమే జన్మించిన కారణ జన్మురాలు! ఇంకా ఎన్నో నాట్య ప్రయోగాలు చేయాలనీ చివరి శ్వాస వరకు తపిస్తూనే వున్నారు! ఇంత అకస్మాత్తుగా ఆమె వెళ్లిపోవడం ద్రిగ్భాంతి ని కలిగిస్తోంది! ఆమెకు అశ్రు నివాళి ! కుటుంబ సభ్యులకు, శిష్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి.
డాక్టర్ శోభా నాయుడు గారి తో పాతికేళ్ల అనుబంధం! దోమలగూడలో వారు వుండే వీధిలో చాలా కాలం నేనూ ఉండటం ఒక కారణం అయితే, ఆమె ప్రదర్శించిన ఎన్నో నృత్య రూపకాలను వార్తలుగా మలిచి ప్రపంచానికి అందించడం మరో ముఖ్య కారణం! ఆమె నాట్యం లో మహా రాణి స్థాయి అయినా వ్యక్తిగతంగా చిన్న పిల్లల మనస్తత్వం! నాదేమో చూసింది చూసినట్లు వున్నది ఉన్నట్లు రాసే నిక్కచ్చి తత్వం! అలా మేము ఇద్దరం నా రివ్యూల విషయం లో చాలా సార్లు వాదించుకున్నాం ! స్నేహానికి విలువ ఇస్తారు! ప్రేమ గా పలకరిస్తారు! డాన్స్ కోసమే జన్మించి ఉంటారనేది ఆమె నమ్మకం! అంత అంకిత భావం తోనే చివరి వరకు నాట్యమే శ్వాసగా నాట్యమే ధ్యాసగా జీవించారు! ఆమె ప్రదర్శనలకు ప్రత్యేకంగా ఆహ్వానించే వారు! మరుసటి రోజు ఆ ప్రదర్శన గురించి మంచి చెడు చర్చించే వారు! విమర్శ మాత్రం ఏమాత్రం తట్టుకోలేరు! ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు పొందిన ప్రముఖ నర్తకీమణుల్లో చాలా మంది ఆమె శిష్యురాళ్లే ! కూచిపూడి నాట్యం అంటే శోభా నాయుడు! శోభానాయుడు అంటే కూచిపూడి! అంతే, ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ శోభా నాయుడు ముద్ర చెదరనిది ! కూచిపూడి నాట్యం ఉన్నంత కాలం ఆమె పేరు శాశ్వతం!













