తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసు.. న్యాయం జరిగేలా చూడాలి : కేటీఆర్
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆమె మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు చెప్పడం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారు తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ అంశంపై అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉన్నత లక్ష్యాలతో అగ్రరాజ్యం వెళ్లిన జాహ్నవి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమైతే, ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే.







