దేశం, తెలంగాణ ఉన్నంత వరకూ సంతోశ్‌బాబు ఉంటారు : మంత్రి కేటీఆర్

గాల్వాన్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్పల్ సంతోశ్ బాబు విగ్రహాన్ని తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని గుర్తుగా ఏర్పాటు చేశారు. దేశం కోసం వీరోచితంగా పోరాటం చేసి, ప్రాణాలు అర్పించిన సంతోశ్ బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భారత సైన్యంలో పనిచేసే ప్రతి కుటుంబానికీ, ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోశ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ మరోసారి హామీ ఇచ్చారు.
గాల్వాన్ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన సంతోశ్ బాబు వీర మరణం అందరికీ గుర్తుండిపోయేలా సూర్యాపేటలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల వ్యయంతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ బోళ్ల శ్రీనివాస్ రెడ్డి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించిన ఆయన్ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. భారత దేశం, తెలంగాణ ఉన్నంత వరకూ కల్నల్ సంతోశ్ బాబును గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. దేశం కోసం కల్పల్ సంతోశ్ బాబు తన ప్రాణాలను అర్పించారని, వాటిని సదా గుర్తుంచుకోవాలన్న స్ఫూర్తితోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చారని మంత్రి కేటీఆర్ వివరించారు.