ఢిల్లీ మీటింగ్ కు కేసీఆర్ హాజరు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారంనాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన ఆయన ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్..రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అవుతారు కేసీఆర్. కృష్ణ, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ తదితర విషయాలపై చర్చిస్తారు. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షిస్తారు. ఎల్లుండి కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.











































































