అసలైన మనవాళ్లు ఎవరో అప్పుడే తెలుస్తుంది
తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నో ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పని చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ ఏ స్థితిలో ఉన్నా తమతోనే ఉన్నారని గుర్తు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని 15 ఏళ్ల క్రితమే చెప్పిన గొప్పనేత కొప్పుల ఈశ్వర్ అని కొనియాడారు. చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయి. అలాగే పార్టీ బాగున్నప్పుడు చాలా మంది నేతలు పార్టీలోకి వస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన మనవాళ్లు ఎవరో తెలుస్తుంది అని అన్నారు. ధర్మపురిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఈశ్వర్ ఎంతో ప్రయత్నించారని, కొందరు రాజకీయ దురుద్దేశంతో రైతులను రెచ్చగొట్టి పరిశ్రమ ఏర్పాటును అడ్డుకున్నారని విమర్శించారు.













