ఐటీ రంగంలో బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్
నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాష్ట్రం-సవాళ్లు అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించామన్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. మిషన్ భగీరథ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదు అని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దుతు ఇచ్చాం. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. ఐటీ రంగంలో పురోగతి సాధించాం అని తెలిపారు. ఐటీ సెక్టార్ పురోగతిలో యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఐటీ ఉద్యోగులు 30 ఏండ్లలోపే ఇండ్లను కొనేస్తున్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయి. ఐటీ ఉద్యోగులు 9 లక్షల మందికి చేరుకున్నారని తెలిపారు. ఐటీ సెక్టార్ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.













