ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చింది : కేటీఆర్

కరీంనగర్ అంటే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటని, ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ కదనభేరి సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు సభలో సీఎం భాష నాకైతే అర్థం కాలేదు. గొంతు కోస్తా, మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి. అవే ఆయనను కూల్చుతాయి. రేవంత్‌ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏదైనా చేయొచ్చు. బీఆర్‌ఎస్ నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సీఎంగా రేవంత్ ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలి. ఐదేళ్ల పాలన చూశాకే ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు అని సీఎం అంటున్నారు. కాలం తెచ్చింది కాదు. కాంగ్రెస్ తెచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ కేసీఆర్‌ని బద్నాం చేయాలని రిపేర్ చేయడం లేదు. పదేళ్లు మోదీ ప్రధానిగా, ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. కరీంనగర్‌కు మీరేం చేశారో అంతకుముందు వినోద్ కుమార్ ఏం చేశారో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.