తెలంగాణ హక్కులు సాధించాలంటే.. లోక్సభ ఎన్నికల్లో : కేటీఆర్
తెలంగాణ హక్కులు సాధించాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఘట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 420 హామీలిచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందన్నారు. డిసెంబర్ 9న రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ అన్నారని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఆ ప్రస్తావనే లేదని అసహనం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఉచిత బస్సుల వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలుసు. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు జీవనోపాధి దెబ్బతీశారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీల అమలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. కృష్ణా జలాల్లో కేంద్రం మన వాటా తేల్చాలి. కేఆర్ఎంబీకి మన కృష్ణా జలాలు తాకట్టు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను ఎంత మందిని చూశాం. మన బాస్లు, ఢిల్లీ, గుజరాత్లో లేరు. ఢిల్లీలో మన మాట వినపడాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలి. గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటుంది అని అన్నారు.













