ఎన్ఆర్ఐలకు 100 కోట్లు
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లిన వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. తెలంగాణ ఏర్పడముందు ఎన్నారైశాఖ బడ్జెట్ కేవలం రూ.5 కోట్లు ఉండగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.100 కోట్లు ప్రతిపాదించింది. ఎన్నారైశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్, ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించడంతో ప్రవాస తెలంగాణవాసుల అభివృద్ధి, సంక్షేమానికి నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యంగా గల్ఫ్‌లో తెలంగాణవాసుల కష్టాలు తీర్చేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడనున్నది.













