బీజేపీ వచ్చాక ఒక్క మంచిపని జరిగిందా ? : మంత్రి కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నిక ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య పోరాటం కాదని, మోదీ వైఫల్యాలు, కేసీఆర్ సంక్షేమ పథకాలు మధ్య పోరు అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంస్థాన్నారాయణపూర్లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రలోభాలకు లొంగిపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్లుకు అమ్ముడుపోయి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. మోదీ, రాజగోపాల్ రెడ్డి అహంతోనే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. డబ్బులకు సారాకు అమ్ముడుపోయి బీజేపీకి ఓటేస్తే గ్యాస్ సిలిండర్ రూ.4 వేలు అవుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక సిలిండర్ ధర 3 రెట్లు పెరిగింది. బీజేపీ వచ్చాక ఒక్క మంచి జరిగిందా? ప్రశ్నించారు. గాడుదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ఓట్లతోనే బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఎంత రెచ్చగొట్టిన టీఆర్ఎస్ శ్రేణులు ఉద్రేకపడొద్దు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని అన్నారు.













