ఆయనకు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా? : మంత్రి కేటీఆర్
కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా? అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. ఆయనకు లోకల్, నాన్‌లోకల్ ఉంటుందా? కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు లోకల్? కేసీఆర్ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్. అలాంటప్పుడు ఎవరు లోకల్ అని అన్నారు.
తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పింఛనకు కటాప్ డేట్ తొలగిస్తాం. రాష్ట్రంలో 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. జనవరిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తాం. అసైన్డ్ భూములపై యజమానులకు పూర్తి పట్టాలు హక్కులు ఇస్తాం అని అన్నారు.













