నవంబర్లో గ్రేటర్ ఎన్నికలు ?
హైదరాబాద్ మహానగర పాలక వర్గ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జనవరితో పదవీకాలం ముగియనుండగా నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ ఎన్నికలను నూతన సాంకేతిక విధానంతో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రేటర్ ఎన్నికలకు నవంబర్-02న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. దీంతో ఎన్నికలు ముందస్తుగానే జరగనున్నాయన్న వార్తలకు బలం చేకూరింది.













