వాళ్లను విడుదల చేయండి.. యూఏఈ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ యూఏఈ ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌కు విచ్చేసిన ఆ దేశ రాయబారి ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారాయన. యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి నగర పర్యనటలో భాగంగా ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఒక కేసుకు గానూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు రూ. 15 లక్షల రూపాయల పరిహారాన్ని బాధతుని కుటుంబం స్వీకరిచేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తానే నేపాల్ వెళ్లి 2013లోనే బాధిడుతి కుటుంబాన్ని కలిసినట్లు మంత్రి కేటీఆర్, దుబాయ్ రాయబారికి వివరించారు. షరియా చట్టం ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయంలో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిసన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు తాను వివరించిన ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలన్నారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయ దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు.













