సీఎం అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా? : కేటీఆర్
విధ్వంసమైన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నేడు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువాల్సిన అవసరం ఉందన్నారు.













