నల్గొండ ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం : కేటీఆర్
ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్‌ను ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నల్గొండలో ఐటీ హబ్‌కు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో భూమి పూజ చేశారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండకు ఐటీ హబ్ సీఎం కేసీఆర్ పుణ్యమే అని అన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాం. 75 వేల చదరపు అడుగుల్లో 750 మంది కూర్చొనేలా నిర్మించబోయే ఐటీ హబ్ ద్వారా 15 కంపెనీలు 1600 ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాబోయే 16-18 నెలల్లో నల్గొండలో కూడా మళ్లీ మేమే వస్తాం. ఐటీ హబ్‌ని ప్రారంభిస్తాం. కొత్తగా పేద ప్రజల కోసం నల్గొండ పట్టణంలో ఐదు బస్తీ దావాఖానాలను ఈరోజే మంజూరు చేస్తున్నాం. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు కూడా రూ.4.5 కోట్లతో ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఆధునికమైన రెండు వైకుంఠ ధామాలకు రూ.మూడు కోట్లతో పనులు మొదలు పెట్టాలని ఈరోజే ఆదేశిస్తున్నాం. మున్ముందు రోడ్లు, జంక్షన్లను సుందరీకరించి నల్గొండ ముఖచిత్రాన్ని మార్చే బాధ్యత ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.













