తెలంగాణలో భారీ పెట్టుబడితో ఫాక్స్‌కాన్
తైవాన్‌కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో విద్యుత్తు వాహనాల పరిమ్రలను ఏర్పాటు చేయనుంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సంస్థ చైర్మన్ యంగ్లియుతో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఢిల్లీ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణను ఎంచుకున్నట్లు యంగ్లియు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ప్రభుత్వం తరపున అత్యుత్తమ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ దృశ్యరూపక ప్రదర్శన ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు సానుకూలతలు, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత గురించి వివరించారు. ఫార్చ్యూన్ 500 సంస్థ అయిన ఫాక్స్‌కాన్ అత్యధిక ఉద్యోగాలిస్తోందని తెలిపారు. అనంతరం యంగ్లియు మాట్లాడుతూ ఇప్పటికే తమిళనాడు, ఏపీలలో పరిశ్రమను నిర్వహిస్తున్నాం. కొత్తగా తెలంగాణలోనూ స్థాపించి, అక్కడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం అని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్తు వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, డిజిటల్ ఆరోగ్యరంగంలోనూ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని తైవాన్ బృందానికి తెలిపారు. అనంతరం యంగ్లియు ప్రతినిధి బృందాన్ని పోచంపల్లి శాలువా, జ్ఞాపికతో కేటీఆర్ సత్కరించారు.













