ఐటీ హబ్ తో ఖమ్మంలో వెలుగులు
ఖమ్మం అభివృద్ధిలో ఐటీ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన ఐటీ హబ్, ధంసలాపురం, రైల్వే ఓవర్ బ్రిడ్జి, నూతన పోలీస్ కమిషనరేట్ భవనంతో పాటు సుమారు రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఖమ్మం నగరాన్ని మించిన మున్సిపల్ కార్పోరేషన్ మరోకటి లేదన్నారు. తాను మునిసిపల్ మంత్రిగా ఈ మాట చెబుతున్నానన్నారు. అభివృద్ధిలో ఖమ్మం వేగంగా దూసుకుపోతోందన్నారు. గత ఖమ్మంకు, నేటి ఖమ్మంకు ఎంతో తేడా ఉండదన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్ లాంటి ప్రజా ప్రతినిధి ఖమ్మం ప్రజలకు లభించడం అదృష్టంగా ప్రజల హర్ష ధ్యానాల మధ్య పేర్కొన్నారు. ఐటీ హబ్‌ను పట్టుబట్టి ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా పూర్తి చేయించి ఐటీ రంగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పట్టుదలతో పాటు టీఎస్ఐఐసీ, టాస్క్ ఉన్నతాధికారులు కృషిని ప్రశంసించారు. లాక్స్ చేపూరితో పాటు 19 సాప్ట్వేర్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఖమ్మంలో తమ సంస్థలను నెలకొల్పడం తెలంగాణకు, ఖమ్మంకు గర్వకారణం అన్నారు.
సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు గ్రామీణ ప్రాంతాలకు, జిల్లాలకు ఐటీ రంగాన్ని విస్తరింప చేస్తున్నట్లు కేటీఆర్ సృష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యతను పెంపొందింప చేసేందుకు టాస్క్ ద్వారా ఐటీ హబ్‌లను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా యువతలో వృత్తి నైపుణ్యతను పెంపొందింపచేసే రీతిలో టాస్క్, ఐటీ హబ్‌లను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర నలుచెరుగులా ఐటీని విస్తరిస్తున్నామన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరిక మేరకు ఐటీ హబ్ రెండవ దశ విస్తరణ కోసం త్వరలోనే మరో రూ.200 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు.













