ఈ నెల 17న సచివాలయం ప్రారంభోత్సవం : మంత్రి కేటీఆర్
ఈ నెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీగా జనసమీకరణ చేయాలని గ్రేటర్ నేతలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. ఈ నెల 13న గ్రేటర్ పరిధిలోని నియోజవకర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జిలుగా నియమించనున్నట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వకకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గంలోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం. పరేడ్‌గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.













