ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి… నా ఆరోగ్యంపై ఆందోళన వద్దు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. ప్రచార వాహంపై కేటీఆర్, ఇతర నేతలు వెళ్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ముందుకు తూలారు. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూర్ రోడ్డు వద్ద ప్రచార రథం సడన్ బ్రేక్ వేయడంతో వాహన రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో వాహనం మీద ఉన్నవాళ్లు ఒక్కసారిగా ముందుకు తూలారు. వెంటనే అప్రమత్తమైన కేటీఆర్ భద్రతా సిబ్బంది ఆయనను పట్టుకున్నారు. అయితే ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్ రెడ్డి తో పాటు కేటీఆర్ నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దు అని కేటీఆర్ తెలిపారు.













