పీవీకి భారతరత్న ఇవ్వాలి : కేటీఆర్
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే మాజీ ప్రధానికి భారతరత్న ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇతర మంత్రులలో కలిసి పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా లకారం ట్యాంక్‌బ్యాండ్‌పై మాజీ ప్రధాని పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.1.25 కోట్లతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వడమంటే కేంద్రం తనను తాను గౌరవించుకున్నట్లే అవుతుందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన గుర్తు చేశారు. కేటీఆర్‌తో సహా పలువురు మంత్రులు పీవీ పేరు మీద శత జయంతి సంకలనం పుస్తకావిష్కరణ చేశారు.













