తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లు ఖరారు
గవర్నర్ కోటాలో నామినేటెడ్ శాసనమండలి సభ్యుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు పట్టం కట్టింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, వాసవి సేవా సంస్థ చీఫ్ అడ్వైజర్ బొగ్గారపు దయానంద్‌ను ప్రభుత్వం శాసనమండలికి నామినేట్ చేసింది. తన ఆట, పాట ద్వారా ఉద్యమానికి ఊపునిచ్చిన గోరటి వెంకన్నను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ద్వారా సమున్నత గౌరవం కల్పించింది. ఉమ్మడి ఏపీలో చిట్టచివరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్య తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్ వాసవి సేవా కేంద్రం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.













