కొండకల్ లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ భూమిపూజ
ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే వందేభారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు మరిన్ని వస్తే ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి గంటలో కరీంనగర్, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరు చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ శివారులో మేధా సంస్థ నిర్మించతలపెట్టిన రైల్ కోచ్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ 106 ఎకరాల్లో ఏర్పాటవుతుండగా 40 ఎకరాల భూములు కొండకల్ పరిధిలో, 66 ఎకరాలు వెల్లిమల గ్రామ పరిధిలో ఉన్నాయి. శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ యుగంధర్‌రెడ్డి 1984లో స్థాపించిన మేధా సంస్థ దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం రైలు కోచ్‌లు, లోకోలు తయారు చేసే స్థాయికి ఎదగడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో నడిచే వందే భారత్ రైలుకు సిగ్నలింగ్, అనేక పరికరాలు తయారు చేసి సంస్థగా మేధాకు గుర్తింపు ఉందన్నారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొండకల్లో ఈ పరిశ్రమ రావడంతో ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుందన్నారు. రైల్ కోచ్ పరిశ్రమలో మొదటి యూనిట్‌ను 15 నుంచి 18 నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రితో ప్రారంభిస్తామన్నారు.













