ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగియగా.. తెలంగాణతో పోల్చితే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గతేడాదే పూర్తి కాగా.. ఎంపీ ఎన్నికలు ఈ ఏడాది జరిగాయి. అయితే ఏపీలో మాత్రం 25 ఎంపీ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు 13వ తేదీనే ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఏర్పడబోయే ప్రభుత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే దానిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలోకి రాబోయే పార్టీ గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాగా ఈ మధ్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.