ఈ కార్యక్రమంతో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు : మంత్రి కేటీఆర్
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా -ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసుకు రెండో రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తొలి రోజు రాలేకపోయానన్నారు. హైదరాబాద్లోని యువత, మోటార్ స్పోర్ట్స్ ఔత్సాహికులు రేసును వీక్షించేందుకు తరలివస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంతో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు. రేస్ కారణంగా నగరవాసులకు కొంత అసౌకర్యం కలుగుతున్న విషయం వాస్తవమే. కానీ, ఓపికతో మన్నించి సహకరిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత ఈ వెహికల్ అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మూడు డబుల్ డెక్కర్ బస్సుల సంఖ్యను రానున్న రోజుల్లో 30కి తీసుకెళ్లేలా చూస్తున్నామని తెలిపారు.













