హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అద్భుత పారిశ్రామిక, మౌలిక విధానాలు దేశ మంతటా విస్తరించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆకాంక్షించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అంశంపై నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో మంత్రి ప్రగతి భవన్ నుంచి పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైనతీరిలో ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరుతుందన్నారు. విప్లవాత్మకమైన సంస్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలకు సిద్ధంగా ఉండేలా మౌలిక వసతుల కల్పన చేయడం వల్ల దేశం మరింత వేగంగా పురోగమిస్తుందని అన్నారు. అతి తక్కువ వయసు కలిగిన రాష్ట్రం తెలంగాణ. గత ఏడేళ్లుగా అనేక అంశాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
టీఎస్ఐపాస్ విధానం ప్రపంచాన్ని విస్మయపరిచింది. మౌలిక సదుపాయాల కల్పనకు తోడు టీఎస్ బీపాస్ వంటి నూతన విధానాలు, అతిపెద్దదైన ఎత్తిపోతల కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీ, రోడ్ల నిర్మాణం, రైతు బంధు, టీఎస్ఐపాస్, పట్టణ ప్రకృతివనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్నాయి. భారతదేశం తన బలమైన మానవ వనరులు, మేధోశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. దేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాలి. తెలంగాణ ప్రభుత్వం టీహబ్, వీహబ్ టీవర్క్స్, రిచ్ వంటి వాటిద్వారా ఆవిష్కరణలకు ఊతమిస్తోందని తెలిపారు.













