పదేళ్ల విరామం తర్వాత అసెంబ్లీకి.. ఎర్రజెండా
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసిన ఏకైక స్థానంలో విజయం సాధించింది. కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ ఈ స్థానంలో పోటీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో సీపీఐ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా, అందులో కూనంనేని ఒకరు. 2014 ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే సంఖ్య ఒకటికే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ప్రజాకూటమిలో భాగంగా సీపీఐ పోటీ చేసినా ఎవరూ విజయం సాధించలేదు. దీంతో ఈసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కించుకోవడమే లక్ష్యంగా పొత్తులు, సీట్ల విషయంలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించింది. కాంగ్రెస్ తొలుత కొత్తగూడెం, చెన్నూరు సీట్లు ఇస్తామని ప్రతిపాదించింది. సీసీఎంతో చర్చలు ఆలస్యం కావడం, ఈలోగా జి.వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో చేరడంతో సీపీఐకి ఒక్క కొత్తగూడెం స్థానాన్ని మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం.













