ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన : కోమటిరెడ్డి
సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై జరిగిన హత్యచార ఘటన అమానుషమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు రక్షణ లేకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఈ ఘటన దారుణమని తెలిపారు. నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం బాధాకరమన్నారు. బాలిక కనిపించడం లేదనగానే, పోలీసులు స్పందిస్తే అమ్మాయి బ్రతికి ఉండేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని చెప్పేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పోలీసు శాఖకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. అవన్ని డబ్బులతో కొనుక్కుంటున్న అవార్డులని విమర్శించారు.













