ఆ జీవోను రద్దు చేయకపోతే … తాను దీక్ష చేస్తా
కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 246ను రద్దు చేయకపోతే తాను దీక్షకు సిద్ధమవుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 18న జారీ చేసిన జీవో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ`మహబూబ్నగర్ జల్లాల మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రోజుకు 8 నుంచి 11 టీఎంసీలు మేర కృష్ణా జలాలను తోడుకుపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుబాటులో ఉన్న 90 టీఎంసీల నీటిలో 30 టీఎంసీలు ఎస్ఎల్బీసీకి, 40 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, 20 టీఎసీలు డిరడి ఎత్తిపోతల పథకానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ నీటి కేటాయింపు విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్ను కలుస్తానన్నారు.













