కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏదో ఒకరోజు నేనూ కూడా
కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నామినేషన్ వేశారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు నల్గొండను నాశనం చేశారని విమర్శించారు. పోలింగ్ ముందు రైతు బంధు వేస్తారని, దానితో మోసపోవద్దని సూచించారు. డిసెంబర్ 9 కాంగ్రెస్కు లక్కీ నెంబర్ అని పేర్కొన్నారు. సోనియా పుట్టినరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ నుంచి తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతానని తెలిపారు. అయితే సీఎం కావాలనే తొందర మాత్రం తనకు లేదని తెలిపారు.













